హైదరాబాద్: దసరా పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలను ఇనుప బోనుల్లో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్న వ్యాపారులపై హైదరాబాద్ సిటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పౌరుల నుంచి లభించిన పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు.. మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనులో ఉన్న రెండు పాలపిట్టలను విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించారు. అలాగే ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు వేలాడదీసిన బోనులోని ఒక పాలపిట్టను, మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో నిర్బంధించిన మరో పాలపిట్టను పోలీసులు రెస్క్యూ చేశారు.
ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ వివరాలను వెల్లడించారు. పండుగ పేరుతో మూగజీవులను బంధించి ఆహారం, నీళ్లు లేకుండా హింసించడం అత్యంత అమానవీయమని, సమాజంలో ఇలాంటి అనైతిక పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దని పిలుపునిచ్చారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే డయల్ 112 లేదా అటవీశాఖ టోల్‌ఫ్రీ నంబర్లకు (1800 425 5364, 9803338666) సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

