Breaking News

చెన్నేకొత్తపల్లిలో టీడీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్‌!

సీఐ, ఎస్‌ఐ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 22: (E6tv NEWS).

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులపై చెన్నేకొత్తపల్లి ఇన్‌చార్జి సీఐ ఇస్మాయిల్, ఎస్‌ఐ సత్యనారాయణ లాఠీలతో దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్ కేంద్రాలకు దూరంగా ఉన్నప్పటికీ తమ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ నేతల ఆరోపణల ప్రకారం.. ఉదయం 7 గంటలకే వైసీపీ నాయకులను నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతించారని, వారితో పోలీసులు సన్నిహితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పుట్టపర్తిలో పనిచేస్తున్న హోంగార్డు నాగేంద్ర బంధువు నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్న టీడీపీ నాయకులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. తాము తమ పార్టీ నాయకుడి నామినేషన్ కోసం వచ్చామని చెప్పినా వినకుండా లాఠీలతో కొట్టారని, అక్కడ ఉన్న యాచకులపైనా దాడి చేశారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అక్కడికి చేరుకుని బాధిత నాయకులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పరిటాల సునీత జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌కు ఫోన్ చేసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు.ప్రశాంతంగా ఉన్న తమ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ సతీష్ కుమార్, సీఐ, హోంగార్డులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. దీంతో నాయకులు ఆందోళన విరమించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, వైసీపీ నాయకులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, ప్రశాంతంగా ఉన్న తమ పార్టీ నాయకులపై పోలీసులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *