లారీ ముందు చక్రాలు విడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానం
నిజామాబాద్, అక్టోబర్ 28 (E6tv న్యూస్).
నిజామాబాద్ నగర శివారులోని హైదరాబాద్ రోడ్డుపై నడిపల్లి గ్రామ సమీపంలో భారీ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. TN 34Y 9094 నంబర్ గల ఈ భారీ వాహనం రోడ్డు దిగి పొదల్లోకి వెళ్లడంతో స్థానికంగా కలకలం రేగింది.
లారీ ముందు చక్రాలు వాహనం బాడీ నుంచి విడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో హైదరాబాద్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ లారీ రోడ్డు పక్కన నిలిచిపోవడంతో హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రమాదానికి గురైన లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.



