తిరుపతి జిల్లా రాజకీయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భూవివాదం నేపథ్యంలో జరిగిన బాలయ్య అనే వ్యక్తి హత్య కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ కమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి.. పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. తన అనుచరుల ద్వారా జైలు నుంచే నామినేషన్ దాఖలు చేసిన ఆయన, సతీమణి ప్రభావతమ్మ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో అధికారిక అభ్యర్థిగా ఖరారయ్యారు.
ప్రస్తుతం సత్యనారాయణ రెడ్డి తరఫున ఆయన భార్య ప్రభావతమ్మే క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. మరోవైపు, పోలీసుల అనుమతితో సత్యనారాయణ రెడ్డి జైలు నుంచే ఓటర్లకు ఒక లేఖ విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా తాను అందిస్తున్న ప్రజాసేవను, మండల ప్రగతికి చేసిన కృషిని గుర్తుచేస్తూ.. జైలులో ఉన్నప్పటికీ పెళ్లకూరు ప్రజల సంక్షేమం కోసమే పోటీ చేస్తున్నానని, కులమతాలకు అతీతంగా తనను గెలిపించాలని అందులో అభ్యర్థించారు.
