Breaking News

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.. ఫోన్ ఫ్లాష్‌లైట్లతో ఫ్లాష్ వాక్

నిజామాబాద్, అక్టోబర్ 30 (E6tv న్యూస్: శివ ఠాకూర్).

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాశ్ సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఫోన్ ఫ్లాష్‌లైట్లతో ప్రత్యేక ఫ్లాష్ వాక్, అవగాహన ర్యాలీ నిర్వహించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్ వినియోగిస్తున్నారని, ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.ఆన్‌లైన్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశ చూపి ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే విధానం లేదని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించే ముందు పంపే వ్యక్తి వివరాలు, లావాదేవీల నిజానిజాలను ఒకటికి పదిసార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ప్రజల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని, ఇందుకు పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.సైబర్ నేరాలకు గురై డబ్బులు కోల్పోయిన తర్వాత తిరిగి రికవరీ చేయడం కొంత కష్టంతో కూడుకున్న ప్రక్రియ అయినప్పటికీ, బాధితులకు డబ్బులు తిరిగి అందించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం, అప్రమత్తత పెరుగుతాయని పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది. అనంతరం అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాశ్ పోలీసు అధికారులు, సిబ్బంది, పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, పోలీసు అధికారులు శ్రీధర్ రెడ్డి, ప్రసాద్, సత్యనారాయణ, సందీప్, హరిబాబు, యాదగిరి గౌడ్, సునీల్ కుమార్, న్యాయవాదులు, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *