Breaking News

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

1,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు.. 61 స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర నిఘా

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.. అల్లర్లు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

పుట్టపర్తి, అక్టోబర్ 30 (E6 TV న్యూస్).

శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నవంబర్ 1వ తేదీన పుట్టపర్తి, హిందూపురం, కదిరి, పెనుకొండ, మడకశిర, ధర్మవరం మున్సిపాలిటీల పరిధిలో జరగనున్న పోలింగ్ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ వెల్లడించారు.

ఎన్నికల భద్రతా విధుల కోసం సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా విభజించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సివిల్ పోలీసులతో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీలు, ఏపీఎస్పీ బలగాలను మోహరించినట్లు వివరించారు.శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక పోలీసు బృందాలు, రూట్ మొబైల్స్, 61 స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర గస్తీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను కూడా సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ..

ఎన్నికల నియమావళిలో భాగంగా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30తో పాటు సంబంధిత ఆంక్షలు అమలులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు.బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని అరికట్టడంతో పాటు నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేశారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, ఘర్షణలు సృష్టించడం, అల్లర్లకు పాల్పడటం లేదా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అక్రమాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు ఏవైనా దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని ఎస్పీ సతీష్ కుమార్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *