Breaking News

భైంసాలో విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలపై అవగాహన

“సురక్షిత బాల్యం ప్రతి బిడ్డ హక్కు.. పిల్లల రక్షణ మనందరి బాధ్యత”

భైంసా, అక్టోబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి).

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పురానా బజార్ ప్రాంతంలో ఉన్న సర్వేశ్వర పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA), నిర్మల్ ఆధ్వర్యంలో “సురక్షిత బచపన్ అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల హక్కులు, రక్షణ, చట్టపరమైన భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా బాలల ప్రాథమిక హక్కులు, పిల్లలపై జరిగే నేరాలు, వాటి నుంచి రక్షణ పొందేందుకు అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాల గురించి వివరించారు. ముఖ్యంగా బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో (POCSO) చట్టం–2012పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా భయపడకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రతి చిన్నారికి సురక్షితమైన వాతావరణంలో విద్యను అభ్యసించే హక్కు ఉందని, బాలల హక్కులను పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు బాలల రక్షణ పట్ల సామాజిక బాధ్యతను పెంచవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి పొరికా రవీందర్ హాజరయ్యారు. DLSA కార్యదర్శి సాయి కిరణ్, టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, న్యాయవాది అమ్జాద్ షైక్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

“సురక్షిత బాల్యం ప్రతి బిడ్డ హక్కు.. బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *