ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. రెండు చోట్లా నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. పులివెందులలో టీడీపీ నుంచి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉండగా.. ఒంటిమిట్టలో ముద్దుకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు పార్టీల నేతలు రాష్ట్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించారు. మరోవైపు ఓటుకు భారీగా నగదు పంపిణీ జరిగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పులివెందులలో 700 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసి, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. అధికార, ప్రతిపక్షాలకు అగ్నిపరీక్షగా మారిన ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ముగింపు..
