అంబేద్కర్ కాలనీలో శిథిలావస్థకు చేరిన ఇళ్లపై స్పందన
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో బాధితులకు న్యాయం చేసేందుకు కృషి
ఆధార్ కార్డులు, అవసరమైన పత్రాలు అందిస్తే అర్హులకు ఇళ్లు మంజూరయ్యేలా ప్రయత్నం
రుద్రూర్, నవంబర్ 20(E6tv NEWS).నిరుపేదల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము భరోసా ఇచ్చారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాల సమస్యలపై ఆయన స్పందించారు.కాలనీలో ఇళ్లు కూలిపోయి, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనల మధ్య జీవిస్తున్న బాధితుల పరిస్థితిని తెలుసుకున్న పత్తి రాము ఫోన్ ద్వారా వారితో మాట్లాడి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పాటు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, అర్హులైన బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.బాధితులు తమ ఆధార్ కార్డులు, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను అందించాలని సూచించారు. పత్రాలను పరిశీలించి సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి అర్హులకు ఇళ్లు మంజూరయ్యేలా తనవంతుగా 100 శాతం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పత్తి రాము మాట్లాడుతూ.. పేద ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడతామని, నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.బాధితుల సమస్యపై స్పందించి వారికి భరోసా కల్పించిన పత్తి రాముకు అంబేద్కర్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.
