ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో నేర్చుకోవాలి
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రశ్నించే తత్వం పెంపొందించాలి: ఎంఈఓ రాజీ మంజుష
సాలూర, నవంబర్ 22: (E6tv NEWS: శివ ఠాకూర్).
విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించుకోవాలని సాలూరు మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజుష సూచించారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.సాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రధానమంత్రి, స్పీకర్, వివిధ శాఖల మంత్రులు, ప్రతిపక్ష నాయకుల పాత్రలను పోషిస్తూ పార్లమెంటరీ సమావేశాన్ని ప్రత్యక్షంగా నిర్వహించారు. ప్రజారోగ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఎల్నినో ప్రభావం తదితర అంశాలపై విద్యార్థులు ప్రశ్నలు సంధించారు. ఆయా శాఖల మంత్రుల పాత్రలు పోషించిన విద్యార్థులు సమాధానాలు ఇవ్వడంతో సభ ఆసక్తికరంగా సాగింది. విద్యార్థుల ప్రశ్నించే తీరు, సమాధానాలు ఇచ్చిన విధానం, సభను నిర్వహించిన పద్ధతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ఎంఈఓ రాజీ మంజుష మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజం, ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మాక్ పార్లమెంట్ ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కలుగుతుందని, రాజ్యాంగ స్ఫూర్తి, ప్రతిపక్ష పాత్ర, ప్రశ్నించే తత్వం, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసం వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దండు రాజ్ కుమార్, బగారే లక్ష్మి ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజుష కార్యక్రమాన్ని పర్యవేక్షించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ఆచరణలో అనుభవించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, పౌర బాధ్యత, ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవాన్ని పెంపొందించేలా సాగింది.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, గంధం సాయిలు, సంగీత్ రావు, అబ్బయ్య, జ్యోత్స్న, విజయలక్ష్మి, స్వర్ణలత, మేడి రవి, అక్షయ్ కుమార్ జాదవ్, అంజన, విక్రమ్, శ్రీకాంత్ రెడ్డి, యశశ్రీ, సునీత, హనుమాన్లు తదితర ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




