Breaking News

ఏఐకేఎంఎస్ నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

రైతులు, కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

బిచ్కుంద, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలోని కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (ఏఐకేఎంఎస్) నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు.

బిచ్కుంద మండల మార్కెట్ యార్డులో శనివారం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయం, ఆహార మార్కెట్లపై కార్పొరేట్ల నియంత్రణ పెరుగుతోందని, భూస్వామ్య దురాగతాలు కొనసాగుతున్నాయని అన్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ రూపొందించేందుకు జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ పేదలకు వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు లేకపోవడం, వేతనాలు, ఉపాధి అవకాశాలు లేక వలసలు పెరగడం, బలవంతపు నిర్వాసితీకరణ వంటి సమస్యలపై మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు. భూమి, ఉపాధి, వేతనాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులకు చౌకగా వ్యవసాయ ఉత్పాదకాలు అందించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం సి2+50 శాతం ఆధారంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.గ్రామీణ సంక్షేమ పథకాలపై జరుగుతున్న దాడులు, పేదల జీవన ప్రమాణాల అభివృద్ధిని విస్మరిస్తున్న తీరుపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. మతపరమైన దాడులు, కుల, లైంగిక అసమానతలు, పర్యావరణ విధ్వంసం వంటి అంశాలపై కూడా తీర్మానాలు చేయనున్నట్లు వివరించారు.

ఈ జాతీయ మహాసభలకు 20 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని వేల్పూర్ భూమయ్య కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్. సాయిబాబా, జాదవ్ బాబు నాయక్, రాథోడ్ శంకర్, గొనె బాలయ్య, గొనె మారుతి, జాదవ్ గోవింద్, పిట్ల లక్ష్మణ్, ఎట్లారా నాగమణి, గొనె జాదవ్, దీప్ చంద్, ఎట్లారా సాయిలు, ఎరిగి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *