సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశంపై ఏలే మల్లికార్జున్ స్పందన
కామారెడ్డి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి).
గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించవద్దని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినదిగా సోషల్ మీడియాలో ఒక సందేశం ప్రచారంలో ఉందని, అందులో గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో రాజకీయ పాటలు, డ్యాన్సులు చేయడంతో పాటు వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని, ఇందుకు నగదు, మద్యం, బిర్యానీ వంటి ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నట్లు తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ సందేశం నిజమైనదా కాదా అన్నది స్వతంత్రంగా నిర్ధారించబడలేదు.ఈ సందేశాన్ని ఉద్దేశిస్తూ ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం భక్తి, విశ్వాసాలకు సంబంధించిన పవిత్రమైన కార్యక్రమమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలతో రాజకీయ ప్రచారానికి ఉపయోగించాలనే ప్రయత్నాలు ఉంటే వాటిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
వినాయకుడి ఊరేగింపుల్లో భక్తి గీతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువతను రాజకీయ ప్రచారాల కోసం ప్రలోభపెట్టడం కంటే సమాజ సేవకు ప్రోత్సహించాలని సూచించారు.గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. రాజకీయ ప్రచారానికి అనేక వేదికలు ఉన్నాయని, గణేష్ నిమజ్జనాన్ని మాత్రం రాజకీయ ప్రచార వేదికగా మార్చవద్దని ఏలే మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు.

