బాల్కొండ, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి)
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో బాల్కొండ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ‘ప్లాస్టిక్ రహిత బాల్కొండ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 3,000 స్టీల్ ప్లేట్లు, 1,000 స్టీల్ గ్లాసులతో స్టీల్ బ్యాంక్‌ను ప్రారంభించారు.
వినాయక చవితి సందర్భంగా గ్రామంలో యువజన సంఘాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలకు గ్రామపంచాయతీ స్టీల్ బ్యాంక్ నుంచి ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందిస్తున్నారు. ఇప్పటివరకు 42 యువజన సంఘాలు, ఇతర సంఘాలకు అన్నదాన కార్యక్రమాల కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందించినట్లు గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.భవిష్యత్తులో బాల్కొండ గ్రామంలో జరిగే అన్నదానాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులను గ్రామపంచాయతీ స్టీల్ బ్యాంక్ ద్వారా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం కోరింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్, వార్డు సభ్యులు పిట్ల దయాకర్, తెడ్డు సందీప్, ఫాజిల్, అతిక్తో పాటు పలువురు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


