హైదరాబాద్‌లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ గృహ నిర్మాణ బోర్డు (టీజీహెచ్‌బీ) సోమవారం నుంచి అలాట్మెంట్ పత్రాలను జారీ చేస్తోంది. అర్హులైన వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా వాట్సప్, SMS ద్వారా ఈ పత్రాలను పంపుతున్నామని, లబ్ధిదారులు టీజీహెచ్‌బీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. మరోవైపు, శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో 480 ఫ్లాట్లతో నిర్మించనున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఓపెన్ మార్కెట్లో రూ.50 లక్షల విలువ చేసే ఈ ఫ్లాట్‌ను పేద లబ్ధిదారులకు కేవలం రూ.6 లక్షలకే అందించడం విశేషం.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ పరిధిలో నిర్మాణం పూర్తయిన 21 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా లక్కీ డ్రా నిర్వహించి పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల సముదాయాలకు 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, అక్టోబర్ చివరినాటికి తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలని గడువు విధించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అనర్హులను తక్షణమే తొలగించాలని, కేటాయించిన ఇళ్లలో నివసించని వారికి తుది నోటీసులు ఇచ్చి రద్దు చేసి, ఆ ఇళ్లను కొత్త అర్హులకు అందించాలని అధికారులకు ఖరాకండిగా చెప్పారు.

