Breaking News

అవకతవకలకు తావులేదు..

స్వయం సహాయక సంఘాల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి

బకాయిలు, స్త్రీనిధి రుణాల రికవరీకి చర్యలు

వ్యక్తిగత కక్షలకు తావులేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పని చేయాలి: ఏపీఎం సువర్ణ

సిరికొండ, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్).

స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని సిరికొండ APM సువర్ణ స్పష్టం చేశారు. సంఘాల నిధులను దుర్వినియోగం చేసినా, లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.

సోమవారం ఆమె E6tv NEWS మాట్లాడుతూ మండల కేంద్రంలోని కొన్ని స్వయం సహాయక సంఘాల లావాదేవీలు సక్రమంగా నిర్వహించడం లేదన్న సమాచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆయా సంఘాల ఆర్థిక వ్యవహారాలను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరలోనే రికవరీ చేయడానికి చర్యలు చేపడతామని తెలిపారు. సంఘాల అభివృద్ధికి సంబంధించిన నిధులు సక్రమంగా వినియోగించేలా పర్యవేక్షణ మరింత పెంచుతామని పేర్కొన్నారు.అదేవిధంగా స్త్రీనిధి రుణాలకు సంబంధించిన బకాయిలను కూడా త్వరితగతిన రికవరీ చేయాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఏపీఎం సువర్ణ తెలిపారు. సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంఘాల నిర్వహణలో పారదర్శకత పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

కొంతమంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన వ్యవహారాల్లో క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ దృష్టికి వస్తే, నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన నిధులు, సంఘాల సొమ్ము విషయంలో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అధికారులు, సిబ్బంది వ్యక్తిగత కక్షలు, విభేదాలకు తావులేకుండా ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలని ఆమె సూచించారు. స్వయం సహాయక సంఘాల బలోపేతం, సభ్యుల ఆర్థిక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *