నంద్యాల: నంద్యాల జిల్లాలోని గోరకల్లు జలాశయం వద్ద తీవ్ర కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి జలాశయం అవుట్‌ఫాల్ గేటును ఎత్తివేయడంతో కాలువలో సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా కాలువ పొంగిపొర్లి, జలాశయం నీరు సమీపంలోని గోరకల్లు గ్రామంలోకి ప్రవేశించింది.
నీటి ఉధృతిని చూసి భయాందోళనకు గురైన గ్రామస్తులు, ప్రాణభయంతో చీకట్లోనే సమీపంలోని కొండపైకి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ప్రాజెక్టు గేటు నుంచి నీరు భారీగా వృథాగా దిగువకు ప్రవహించింది. సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గేటును కిందకు దించడంతో నీటి ప్రవాహం అదుపులోకి వచ్చింది. అసలు గేటును ఎవరు ఎత్తారనే కోణంలో అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు.

