జీవో 52 రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి).
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు. గత ఐదు రోజులుగా ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ఎలక్ట్రీషియన్లు, లైన్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, వాటర్ సెక్షన్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికులు తన కుటుంబ సభ్యులతో సమానమని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారి సమస్యల పరిష్కారం కోసం అండగా ఉంటానని తెలిపారు.
జీవో 52ను రద్దు చేయాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.19,500 వేతనాన్ని పెంచి కనీస వేతనంగా రూ.26,000 అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రివేళల్లో విధులు నిర్వహించే కార్మికులకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు.విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందితే అంత్యక్రియల కోసం తక్షణమే రూ.20 వేల సాయం అందించాలని, మృతుల కుటుంబ సభ్యులకు వయోపరిమితి సడలింపుతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
వినాయక చవితి ఉత్సవాల సమయంలో వీధిదీపాలు వెలగకపోవడంతో నగరంలో సమస్యలు ఏర్పడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ వంటి కీలక సేవలకు మున్సిపల్ కార్మికులు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
కార్మికుల సమ్మె కారణంగా నగరంలో పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వెంటనే కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని గణేష్ బిగాల డిమాండ్ చేశారు.కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.



