ప్రభుత్వం,పోలీసులు కనీస మానవత్వంతో వ్యవహరించాలి
భేషరతుగా క్షమాపణ చెప్పి.. కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్
(E6tv NEWS: సెప్టెంబర్ 22).
వరంగల్‌లో చోటుచేసుకున్న ఘటనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ సీనియర్ నేత వినయ్ భాస్కర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు.
సీనియర్ ప్రజాప్రతినిధితో అలా వ్యవహరించడం సరికాదు
రోగులను పరామర్శించేందుకు వెళ్లిన వినయ్ భాస్కర్ పట్ల పోలీసులు కనీస మానవత్వం లేకుండా వ్యవహరించారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సీనియర్ ప్రజాప్రతినిధితో పోలీసులు అలా వ్యవహరించకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. వేధింపులు, అరాచక వైఖరిని నమ్ముకుంటే ప్రజల మద్దతును కోల్పోయే పరిస్థితి వస్తుందని ప్రభుత్వ పెద్దలు, పోలీసులు గుర్తించాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగకూడదు
ఇటీవల అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని, పార్టీ నేతల ఇళ్లపైకి పోలీసులు వెళ్లిన ఘటనలు ఉన్నాయని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా పరామర్శకు వెళ్తున్న వినయ్ భాస్కర్‌పై కూడా దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు చోటు ఉండకూడదని అన్నారు.
కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్
వినయ్ భాస్కర్ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు.

