బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించిన ముగ్గురికి సీఐ జయనాయక్ ఘన సన్మానం
ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికం
ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి)
రోడ్డుపై లభించిన బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ముగ్గురు వ్యక్తులను ధర్మవరం టూ టౌన్ సీఐ జయనాయక్ ఘనంగా సన్మానించారు. ఆటో డ్రైవర్ నరసింహులు, కుమ్మర రామాంజనేయులు, సిద్ధమ్మలను శాలువాలతో సత్కరించి, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికాన్ని అందజేశారు.
వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం నుంచి ప్రైవేట్ బస్సులో ధర్మవరం వచ్చిన రాజేశ్వరి సెప్టెంబర్ 17న ధర్మవరం పోలీస్‌స్టేషన్ సమీపంలో బస్సు దిగే సమయంలో తన వద్ద ఉన్న సుమారు మూడు తులాల బంగారు నెక్లెస్‌ను పోగొట్టుకున్నారు. అదే సమయంలో నెక్లెస్ నరసింహులు, రామాంజనేయులు, సిద్ధమ్మలకు లభించింది. వారు ఎలాంటి స్వార్థానికి తావులేకుండా వెంటనే నెక్లెస్‌ను ధర్మవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు.నెక్లెస్ పోగొట్టుకున్న రాజేశ్వరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను పిలిపించి, లభించిన బంగారు నెక్లెస్‌ను పరిశీలించిన అనంతరం ఆమెకు అప్పగించారు.
ఈ సందర్భంగా సీఐ జయనాయక్ మాట్లాడుతూ.. విలువైన బంగారు ఆభరణం లభించిన వెంటనే పోలీసులకు అప్పగించడం ముగ్గురి నిజాయితీకి నిదర్శనమన్నారు. ఇలాంటి నిజాయితీపరులు సమాజంలో ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు కూడా బస్సులు, ఆటోలు, రహదారులు తదితర ప్రాంతాల్లో బంగారు ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులు లభిస్తే తమ వద్ద ఉంచుకోకుండా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు అప్పగించాలని సూచించారు.



