డ్రైవర్లు, సిబ్బందికి రోడ్ సేఫ్టీపై అవగాహన
నిజామాబాద్, సెప్టెంబర్ 23:(E6 tv NEWS: ప్రతినిధి).
రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అధికారులు సూచించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డ్రైవర్లు, సిబ్బందికి రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి A.M.V.I. మణికాంత్ ముఖ్య అతిథిగా హాజరై రహదారి భద్రతపై పలు సూచనలు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి రోడ్ సేఫ్టీ ఈదార్ మేనేజర్ వర్షా నిహంత్ పాల్గొని డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వేగాన్ని నియంత్రించుకోవాలని, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా నివారించవచ్చని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి పర్యవేక్షణలో జరిగింది. కార్యక్రమంలో నిజామాబాద్-1 డిపో మేనేజర్ M.V. రమణ, నిజామాబాద్-2 డిపో మేనేజర్ M. శ్రీనివాస్, సూపర్వైజర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ “సురక్షిత ప్రయాణమే టీజీఎస్ఆర్టీసీ ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు.




