అనంతపురం,సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి)
అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అనంతపురం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. వినికిడి, మాట్లాడే లోపాలతో ఉన్న దివ్యాంగులు సమాజంలో ఇతరులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు అవసరమైన సహకారం, అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, సమాజంపై ఉందన్నారు. దివ్యాంగులు తమ భావాలను, అభిప్రాయాలను ఇతరులకు తెలియజేయడంలో సంకేత భాష ఎంతో కీలకమైన మాధ్యమమని పేర్కొన్నారు.సంకేత భాషపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, విద్య, ఉపాధి తదితర అంశాల్లో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం అనంతపురం జిల్లా బధిరుల సంఘం రూపొందించిన “ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్–2026” పోస్టర్‌ను చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, దివ్యాంగులు, సంకేత భాష నిపుణులు తదితరులు పాల్గొన్నారు.




