Breaking News

క్రీడలకు ఆర్డీటీ మంచు ఫెర్రర్ ఒక వరం

క్రికెట్‌లో రాణించి జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలి

రాయదుర్గంలో క్రికెట్ సెలక్షన్స్‌కు భారీ స్పందన

రాయదుర్గం, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి).

కరువు నేల అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ప్రతిభను వెలికితీసేందుకు ఆర్డీటీ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. క్రీడలకు ఆర్డీటీ, మంచు ఫెర్రర్ వంటి సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. క్రికెట్‌లో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికై పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని యువ క్రికెటర్లకు సూచించారు.

రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమానికి కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సెలక్షన్స్‌కు యువ క్రికెటర్ల నుంచి భారీ స్పందన లభించింది.కార్యక్రమానికి ఆర్డీటీ క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా చరిత్రలో తొలిసారిగా రాయదుర్గంలో క్రికెట్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించడమే రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ లక్ష్యమన్నారు.

జిల్లా వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతిభ కనబరిచిన గ్రామీణ ప్రాంత క్రికెటర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు మచ్చా రామలింగారెడ్డి వెల్లడించారు. అనంతపురంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణంతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఆర్డీటీ చేస్తున్న కృషిని వివరించారు.ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మచ్చా రామలింగారెడ్డితో తనకు 35 సంవత్సరాలకు పైగా పరిచయం ఉందని, క్రికెట్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దిన ఆయన నాయకత్వంలో రాయదుర్గంలో టాలెంట్ హంట్ నిర్వహించడం శుభపరిణామమన్నారు. మహిళా క్రికెట్‌ను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రోత్సహించడంలోనూ మచ్చా రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని కాలువ శ్రీనివాసులు అన్నారు. ఎంపికైన క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందించేందుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. రాయదుర్గం ప్రాంతంలో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని, ఇలాంటి సెలక్షన్స్ ద్వారా భవిష్యత్‌లో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెటర్లు తయారయ్యే అవకాశం ఉందన్నారు.

అనంతరం మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కాలువ శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. అనంతరం క్రికెటర్లను పరిచయం చేసుకున్న కాలువ శ్రీనివాసులు బ్యాటింగ్ చేసి క్రికెట్ సెలక్షన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ సభ్యులు యుగంధర్, ప్రదీప్, ప్రవీణ్ కుమార్, షాకీర్, ఆర్డీటీ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, ఆర్డీటీ ఏటీఎల్ స్కూల్ హెడ్‌మాస్టర్, కోచ్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *