రూ.100–150 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక.. కేంద్ర నిధుల కోసం ప్రయత్నం: మంత్రి సత్యకుమార్
ధర్మవరం, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి)
ధర్మవరం పట్టణానికి ప్రకృతి ప్రసాదించిన వరం ధర్మవరం చెరువని, దాని సహజ స్వరూపాన్ని కాపాడుతూ ఆధునిక హంగులతో అద్భుతమైన లేక్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ) విజయవాడ బృందంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. చెరువు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, మాస్టర్ ప్లాన్‌పై అధికారులతో చర్చించారు.ధర్మవరం చెరువు నిర్మాణంలో ఒడియార్ కీలక పాత్ర పోషించిన చారిత్రక నేపథ్యాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. లేక్‌ఫ్రంట్‌లో ధర్మవరం చరిత్ర, ప్రముఖులు, సాహితీవేత్తలు, క్రీడాకారులు, చేనేత రంగానికి సేవలందించిన వారి వివరాలను ప్రజలకు పరిచయం చేసేలా ప్రత్యేక థీమ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఆక్రమణలు, మురుగునీటికి శాశ్వత పరిష్కారం
దశాబ్దాలుగా మురుగునీరు చేరడం, ఆక్రమణల కారణంగా చెరువు సహజ స్వరూపం దెబ్బతింటున్న పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. చెరువును ఆక్రమణల నుంచి పరిరక్షించడంతో పాటు మురుగునీరు చెరువులోకి చేరకుండా చర్యలు తీసుకుని, నీటి నాణ్యతను మెరుగుపరచాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
16 కిలోమీటర్ల వాక్‌వే ప్రతిపాదన
చెరువు చుట్టూ సుమారు 16 కిలోమీటర్ల మేర వాక్‌వే అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. తొలిదశలో పట్టణాన్ని ఆనుకుని ఉన్న సుమారు 3.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని ప్రాధాన్యతగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, పచ్చదనం, సీటింగ్, లైటింగ్, వ్యూయింగ్ పాయింట్లు, భద్రతా రైలింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఏడు ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి
చెరువు పరిధిలో ఏడు ప్రాంతాలను ప్రత్యేక థీమ్‌లతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. యాంఫిథియేటర్, ఫుడ్ స్టాల్స్, పిల్లల పార్క్, బోటింగ్ డెక్స్, పార్కింగ్, టాయిలెట్లు, కుటుంబాలు, యువత, వృద్ధులు సేదతీరే ప్రదేశాలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.మహిళలు, పిల్లలు, వృద్ధులు సాయంత్రం వేళల్లోనూ సురక్షితంగా వినియోగించుకునేలా లైటింగ్, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు, హ్యాండ్‌రైల్స్, టాక్టైల్ పేవింగ్, వీల్‌చైర్ సౌకర్యాలను కూడా ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు తెలిపారు.
చేనేత, స్థానిక కళలకు ప్రోత్సాహం
ధర్మవరం చేనేతకు మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు నిమ్మలకుంట తోలుబొమ్మలు, కుమ్మరి కళలు, ఇతర స్థానిక కళలు, ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా లేక్‌ఫ్రంట్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక కళాకారులు, చేతివృత్తిదారులకు అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.చెరువు సహజ స్వరూపాన్ని దెబ్బతీయకుండా స్థానిక మొక్కలు, పచ్చదనం, నీటి వనరులను పరిరక్షిస్తూ బ్లూ–గ్రీన్ ల్యాండ్‌స్కేప్ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు.
రూ.100–150 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక
ఎస్‌పీఏ విజయవాడ బృందం ఇప్పటికే రెండుసార్లు ధర్మవరం చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమిక ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. సమగ్ర డీపీఆర్ పూర్తయిన తర్వాత ప్రాజెక్టు తుది వ్యయం ఖరారవుతుందని, ప్రాథమికంగా రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రణాళికను తీసుకెళ్లడంతో పాటు, డీపీఆర్ పూర్తయిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ‘అర్బన్ ఛాలెంజ్’ విధానంలో నిధులు సాధించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
‘వికసిత్ ధర్మవరం’లో ప్రజల భాగస్వామ్యం
ధర్మవరం అభివృద్ధిని కోరుకునే ప్రముఖులు, మేధావులు, నిపుణులు, స్థానిక కళాకారులు, వివిధ రంగాల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుని ప్రణాళికను మరింత మెరుగుపరుస్తామని మంత్రి అన్నారు.
“ధర్మవరం చెరువు కేవలం నీటి వనరు కాదు.. ధర్మవరం చరిత్ర, ప్రకృతి, చేనేత, స్థానిక సంస్కృతికి ప్రతీక. దాన్ని కాపాడుకుంటూనే భావితరాలకు అందించడంతో పాటు ప్రస్తుత తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యం” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో ధర్మవరం ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి, ఎస్‌పీఏ విజయవాడ సిబ్బంది, ఈఈ సాయి కృష్ణ, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



