సోమందేపల్లి, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి).
అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యతో పాటు వారి మానసిక, శారీరక అభివృద్ధికి పునాదులు వేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాసేవలో ఆయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సేవా సంకల్ప్ అభియాన్–ఆంగన్ కా ఉత్సవ్” కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు సామూహిక శ్రీమంతం నిర్వహించి పసుపు, కుంకుమ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, తల్లులతో మంత్రి మమేకమై, వారికి అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. గర్భంలో బిడ్డ పడిన నాటి నుంచి ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లులు, చిన్నారుల సంక్షేమానికి ఐసీడీఎస్ శాఖ అండగా ఉంటోందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు కేవలం ఆహారం అందించే కేంద్రాలు మాత్రమే కాదని, చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని పేర్కొన్నారు.
అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. అంగన్వాడీ టీచర్ల జీతాలను రూ.4,200 నుంచి రూ.6,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బందికి రూ.12 వేల జీతం అందిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ సిబ్బందికి అమ్మ ఒడి పథకం ప్రయోజనం అందేలా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందికి సెలవు దినాలను కూడా పెంచినట్లు పేర్కొన్నారు.
“మన అంగన్వాడీ.. మన బాధ్యత, మన పిల్లల ఆరోగ్యం.. మనందరి బాధ్యత” అనే సందేశంతో ప్రతి కుటుంబం అంగన్వాడీ కేంద్రాల సేవల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి తల్లి, ప్రతి చిన్నారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం
కార్యక్రమంలో భాగంగా సోమందేపల్లి మండల వ్యాప్తంగా సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను మంత్రి సవిత ఘనంగా సన్మానించారు. చిన్నారులు, తల్లుల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సీడీపీఓ, సూపర్వైజర్, మండల అధికారులు, గ్రామ సచివాలయ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, కూటమి నాయకులు, మహిళా నాయకులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




