కొత్తగూడెం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి).
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ, పాత కొత్తగూడెం ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారని తెలిపారు. అప్పట్లో ఎంపికైన లబ్ధిదారులకు ముందుగా ఇళ్లను కేటాయించాలని కోరారు.గతంలో ఎంపికైన లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ కొత్తగా లాటరీ నిర్వహించడం వల్ల ఇప్పటికే ఎంపికైన వారికి అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో లాటరీ ద్వారా ఎంపికైన కొంతమంది పేర్లను తొలగించి కొత్త పేర్లను చేర్చడం సరికాదని అన్నారు. పాత లబ్ధిదారుల వివరాలను కూడా పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను కోరారు.
అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్లకు సంబంధించి తమ అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బీజేపీ నాయకుల అభిప్రాయం ప్రకారం ముస్లింలకు కేటాయించిన 12 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసి, వారిని కూడా బీసీ కోటాలో చేర్చి అర్హులైన పేదలకు ఇళ్ల కేటాయింపు జరపాలని కోరారు.ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాకపోవడంతో పాటు, నిర్మాణ నాణ్యతపై కూడా లబ్ధిదారుల్లో ఆందోళన ఉందని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇళ్ల నిర్మాణ నాణ్యతను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన చోట నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. లబ్ధిదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఇళ్లను అందించాలని డిమాండ్ చేశారు.
గతంలో ఎంపికైన లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, అర్హత కలిగిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

