Breaking News

ధాన్యం దళారుల సిండికేట్‌పై రైతుల ఆగ్రహం

రేట్లు తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు

క్వింటాకు రూ.3,800 వరకు ధర పలుకుతుండగా తగ్గింపుపై రైతుల ఆవేదన

చందూర్, అక్టోబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి).
ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం క్వింటాకు సుమారు రూ.3,800 వరకు ధర పలుకుతుండటంతో రైతులు ఊరట చెందుతున్న తరుణంలో.. కొందరు ధాన్యం దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

చందూర్ మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ధాన్యం దళారులు సమావేశాలు నిర్వహించి సిండికేట్‌గా ఏర్పడి రైతులకు అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. దళారులు, కమిషన్‌దారులు ఏకమై ధాన్యం ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సీజన్‌లో ధాన్యానికి మంచి ధర వస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్న సమయంలో ధర తగ్గించేందుకు ప్రయత్నించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రూ.3,800 వరకు ధర పలుకుతున్న ధాన్యాన్ని కృత్రిమంగా తగ్గించే ప్రయత్నాలు చేయడం సరికాదని రైతులు అంటున్నారు.రబీ సీజన్‌లో సాగునీటి లభ్యతపై అనిశ్చితి ఉండటంతో రైతులు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, వర్షాలు సకాలంలో కురవకపోతే మరిన్ని సమస్యలు తలెత్తుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పండించిన పంటకు మంచి ధర లభిస్తున్న సమయంలో దళారులు ధర తగ్గించేందుకు ప్రయత్నించడం తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు.

దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను నియంత్రించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్‌లో పోటీ వాతావరణం ఉండేలా చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.ధాన్యం ధరలను తగ్గించేందుకు సిండికేట్‌గా ఏర్పడిన దళారులపై అధికారులు నిఘా పెట్టి, రైతులకు న్యాయం చేయాలని చందూర్ మండల రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *