దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం 7,000 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిర్ణయించింది. ప్రధానంగా అక్టోబర్ 9, 10, 16 మరియు 17 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించిన అధికారులు, తిరుగు ప్రయాణం కోసం అక్టోబర్ 25, 26 తేదీల్లో కూడా తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని ఎంబీజీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, గచ్చిబౌలి, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను 1.5 రెట్ల వరకు సవరించారు. పెంచిన ఛార్జీలు కేవలం పండుగ రద్దీ ఉన్న ప్రత్యేక రోజుల్లో నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే వర్తిస్తాయి; మిగతా సాధారణ బస్సుల్లో యధావిధిగా పాత ఛార్జీలే ఉంటాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ దసరా ప్రత్యేక బస్సుల్లోనూ యథాతథంగా కొనసాగుతుంది. బస్సుల వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించవచ్చని సంస్థ తెలిపింది.
