హైదరాబాద్ (e6tv news): ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, విద్యార్థులను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, రవాణా ఆంక్షలు, ఇంటర్నెట్ నిలిపివేత, పోలీస్ నిర్బంధాలతో ప్రజాస్వామ్య గొంతును అణచివేయలేరని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని విమర్శిస్తూ, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్ర నాయకులు మరియు విద్యార్థులపై పోలీసుల దాడుల వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో రైతుల ఉద్యమాన్ని అణచివేసినట్లే, ఇప్పుడు విద్యార్థుల ఆందోళనలను తొక్కిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. బ్రిటిష్ పాలననే ఎదిరించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని పేర్కొన్న మంత్రి, బీజేపీ తన నియంతృత్వ వైఖరిని వీడి ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని హితవు పలికారు.
