హైదరాబాద్ (e6tv news): తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో NSUI ఆధ్వర్యంలో, మేడ శ్రీను అధ్యక్షతన బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యూనివర్సిటీ విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆటపాటలతో ప్రాంగణాన్ని మార్మోగించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిపిసిసి ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ రేగులపాటి రమ్య రావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా కమిషన్ మెంబర్ శశికళ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి మరియు మహిళల ఐక్యతకు దివ్య సంకేతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బట్టపోతుల మోహన్, నిత్య రెడ్డి, బైరు రవీందర్, ప్రకాష్, అజయ్ రసకట్ల, వినయ్ తదితరులు పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు.

