Breaking News

భూమికి సమాంతరంగా ట్రాన్స్‌ఫార్మర్‌.. విద్యుదాఘాతానికి దూడ బలి!

రోడ్డు విస్తరణతో పెరిగిన ప్రమాదం.. రూ.30 వేల మూగజీవి మృతి!

మరో ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొనాలి!

ట్రాన్స్‌ఫార్మర్‌ ఎత్తు పెంచి.. రక్షణ కంచె ఏర్పాటు చేయాలి!

ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (E6tv NEWS:ప్రతినిధి).

రోడ్డు విస్తరణతో రహదారి ఎత్తు పెరిగింది.. అదే ట్రాన్స్‌ఫార్మర్‌ ఇప్పుడు ప్రమాదానికి చిరునామాగా మారింది! అధికారుల అప్రమత్తత లోపించిందా? భద్రతా చర్యలు ఎక్కడ? అన్న ప్రశ్నలు దేవునిపల్లి గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి గ్రామ గేటు సమీపంలో పోచారం ప్రధాన కాలువ నుండి పంట పొలాలకు వెళ్లే పిల్ల కాలువ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుదాఘాతానికి గురై రైతు నాగం జనార్ధన్‌కు చెందిన సుమారు రూ.30 వేల విలువైన గేదె దూడ మంగళవారం ఉదయం మృతి చెందింది. మూగజీవి ప్రాణం బలైన ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.

రోడ్డు ఎత్తు పెరిగింది.. ప్రమాదం ముంచుకొచ్చింది!
హైవే రోడ్డు విస్తరణలో భాగంగా రహదారిని ఎత్తు పెంచి వెడల్పు చేయడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ భూమికి సమాంతర ఎత్తులోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ వల్ల ప్రజలు, పశువులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో ప్రమాదం జరగకముందే విద్యుత్‌ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ ఎత్తు పెంచాలని, దాని చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. గేదె దూడను కోల్పోయిన రైతు నాగం జనార్ధన్‌కు సుమారు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *