కోటగల్లి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంపిక
రూ.6 కోట్ల నిధులు మంజూరు.. కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ధన్పాల్
ఇందూరు, అక్టోబర్ 15: (E6tv NEWS: శివ ఠాకూర్)
తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నిజామాబాద్ నగరంలో మరో కీలక విద్యా ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. అర్బన్ నియోజకవర్గ పరిధిలోని కోటగల్లి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఎంపిక చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఎంపిక చేయగా, అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి కోటగల్లి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. గతంలో పలుమార్లు పాఠశాలను సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించి, ఆధునిక విద్యా సదుపాయాలతో పబ్లిక్ స్కూల్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.ప్రస్తుతం ఈ పాఠశాలలో సుమారు 2 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.6 కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అయితే, విద్యార్థులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి, టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
అర్బన్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. ఖిల్లా రామాలయ అభివృద్ధిలో భాగంగా రోప్‌వే ఏర్పాటు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే, కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక్కో డివిజన్లో రూ.20 లక్షల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, బీజేపీ కార్పొరేటర్లు ప్రసన్న, శ్యామల, సత్యపాల్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, చింతకాయల రాజేందర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


