Breaking News

ఐపీఎల్ తరహాలో ఉద్యోగుల క్రికెట్ లీగ్‌.. 30 జట్లు సిద్ధం!

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్‌కు కలర్ టీషర్టుల ఆవిష్కరణ

అనంతపురం, అక్టోబర్ 15: (E6tv NEWS). ఉద్యోగుల్లో ఐక్యత, స్నేహభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్‌-2026కు సంబంధించి కలర్ టీషర్టుల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం అనంతపురం నగరంలోని జిల్లా వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి టీషర్టులను ఆవిష్కరించి, టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల కెప్టెన్లకు అందజేశారు.

ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు విద్య, వైద్య, క్రీడా రంగాల్లో విశేష సేవలందించిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జ్ఞాపకార్థం గత 25 సంవత్సరాలుగా ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న పోటీలు సిల్వర్ జూబ్లీ టోర్నమెంట్‌గా ప్రత్యేకతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు.

ఐపీఎల్ తరహాలో ఎంప్లాయీస్ ప్రీమియర్ లీగ్ అనంతపురం పేరుతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మొత్తం 30 జట్లు పాల్గొంటున్నాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు క్రికెట్‌పై ఆసక్తితో పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.అక్టోబర్ 17న అనంతపురంలోని ఆర్‌డీటీ క్రీడా మైదానంలో టోర్నమెంట్ ప్రారంభమవుతుందని, అక్టోబర్ 18న కూడా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల విధులకు ఇబ్బంది కలగకుండా సెలవు దినాల్లో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులకు కలర్ టీషర్టులను అందజేసినట్లు చెప్పారు.

ఈ టోర్నమెంట్ ఉద్యోగుల మధ్య పరస్పర స్నేహసంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి, క్రీడాస్ఫూర్తికి దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. విజయరాజు, అసోసియేషన్ సభ్యులు వెంకట్, రఘు, ఉద్యోగుల క్రికెట్ జట్ల కెప్టెన్లు జయరామ్ రెడ్డి, వర్ల శంకర్, మారుతి, సతీష్, రవి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

– కె. విజయరాజు
ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఏపీ వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *