Breaking News

జాతీయ స్థాయి మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు ఉట్‌పల్లి గిరిజన ఆణిముత్యం

తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగనున్న జయ మనోజ్ఞ నాయక్‌.. గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు

నిజామాబాద్, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్).

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్‌పల్లి గ్రామానికి చెందిన గిరిజన యువ క్రికెటర్ జయ మనోజ్ఞ నాయక్ జాతీయ స్థాయి మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. గ్రామానికి చెందిన రూడావత్ జయ పవన్ దంపతుల కుమార్తె అయిన మనోజ్ఞ నాయక్ తన ప్రతిభతో జాతీయ స్థాయికి ఎదగడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల సిరిసిల్లాలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ (SGF) రాష్ట్ర స్థాయి క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన మనోజ్ఞ నాయక్ బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్ర స్థాయిలో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి ఎంపిక కోసం నిర్వహించిన ప్రాబబుల్స్‌లోనూ సత్తా చాటి తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికైంది.నవంబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్ మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మనోజ్ఞ నాయక్ తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. జాతీయ స్థాయిలోనూ తన ప్రతిభను చాటి తెలంగాణ రాష్ట్రానికి, నిజామాబాద్ జిల్లాకు, ఉట్‌పల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.

మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం గ్రామంలోని యువతకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మనోజ్ఞ నాయక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *