Breaking News

ఎల్‌నినో నేపథ్యంలో రబీలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ

రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

భైంసా, అక్టోబర్ 15 (E6tv న్యూస్).

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి పంటలను సాగు చేయాలని కోరారు.

గురువారం భైంసాలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో కేంద్ర ప్రభుత్వ మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ కార్యక్రమం ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సబ్సిడీ విత్తనాలను ముందుగా చిన్న, సన్నకారు రైతులకు అందించాలని అధికారులకు సూచించారు.ముధోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కలిపి ప్రస్తుతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 9,000 బస్తాల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం లోటు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పడుతున్నందున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించడంలో గ్రామ సర్పంచులు, సంబంధిత అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.రైతుల విజ్ఞప్తి మేరకు పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా సబ్సిడీపై అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు, నీటి వనరులకు అనుగుణంగా పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మొల్ల దత్తాత్రి, వ్యవసాయ శాఖ ఏడీఏ, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *