హైదరాబాద్ (ఈ6 టీవీ): హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే రాయ్‌దుర్గ్ మెట్రో స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా పీక్ అవర్స్‌లో బ్లూ లైన్‌లో ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు రావాల్సి ఉండగా, ఆ నిరీక్షణ సమయం ఏకంగా 8 నిమిషాలకు పెరిగింది. సాయంత్రం 7:20 గంటల సమయంలో ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులు, ప్రయాణికులు ఇళ్లకు తిరుగుపయనమయ్యే కీలక సమయంలో నాగోల్ వైపు వెళ్లే రైళ్ల కోసం డిస్ప్లే బోర్డులో 8 నిమిషాల వెయిటింగ్ టైమ్ చూపించడంతో ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఇప్పటికే మూడు భోగీలు మాత్రమే ఉన్న మెట్రో రైళ్లలో విపరీతమైన రద్దీతో ఊపిరాడని పరిస్థితులు నెలకొంటున్నాయని, దీనికి తోడు రైళ్ల మధ్య వ్యవధి పెరగడంతో ప్రయాణం మరీ నరకప్రాయంగా మారుతోందని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా పీక్ అవర్స్‌లో రెడ్ లైన్, బ్లూ లైన్‌లలో ప్రతి 4 నిమిషాలకు, గ్రీన్ లైన్‌లో ప్రతి 12 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంటుంది. మెట్రో నెట్‌వర్క్‌లో మొత్తం 57 రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, సమయపాలన పాటించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. దీనిపై మెట్రో నిర్వహణ అధికారులను వివరణ కోరగా, ఆపరేషన్స్ విభాగం నుంచి సమాచారం సేకరించి స్పందిస్తామని తెలిపారు.

