మంచిర్యాల (ఈ6 టీవీ):
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తీవ్ర రూపం దాల్చింది. నియోజకవర్గంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. ఏకంగా ఇద్దరు మంత్రుల సమక్షంలోనే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణను లక్ష్యంగా చేసుకుని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తానూ, తన అనుచరులు రాత్రింబవళ్లు కష్టపడి గెలిపిస్తే, గెలిచిన తర్వాత తమనే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీకృష్ణ తీరు వల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆరోపించారు.
దళితుల సంక్షేమం అంశంపై ఎంపీకి ఎమ్మెల్యే బహిరంగ సవాల్ విసిరారు. “మీరు దళిత ప్రేమికులేమీ కాదు, దళితులను తొక్కిపెట్టిందే మీరు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ధైర్యముంటే దళితులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దానికి పోటీగా తాను వారం రోజుల్లో పది రెట్లు ఎక్కువ మందితో మరో సభను నిర్వహించి తన బలాన్ని నిరూపించుకుంటానని సవాల్ చేశారు. సీనియర్ మంత్రుల ముందే జరిగిన ఈ తీవ్ర పరిణామం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపగా, దీనిపై ఎంపీ వంశీకృష్ణ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

