Breaking News

నీటి సమస్యపై తీవ్ర నిరసన: జూరాల యాత్రలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్‌

మహబూబ్‌నగర్ (ఈ6 టీవీ): జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన రైతులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు మంగళవారం జడ్చర్ల వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో జడ్చర్లలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాంచందర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితర కీలక నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు రేవంత్ ప్రభుత్వం మరియు పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

అరెస్ట్‌కు ముందు మీడియా మాట్లాడిన రాంచందర్ రావు.. ప్రాజెక్టులో సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు పోరాడుతున్న రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తుంటే, ప్రతిపక్ష నాయకులను మార్గమధ్యంలోనే నిర్బంధించడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, తెలంగాణలో మళ్లీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) వాతావరణాన్ని తలపింపజేస్తోందని విమర్శించారు. రైతుల హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయిలో పోరాటాన్ని మరిన్ని రూపాల్లో ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *