హైదరాబాద్: ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన నాల్గవ ‘క్లౌడ్ రీజియన్’ (డేటా సెంటర్)ను సోమవారం హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభించింది. దేశ డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ. 1.70 లక్షల కోట్ల (20.5 బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే పూణే, చెన్నై, ముంబైలలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్లు సేవలు అందిస్తుండగా, హైదరాబాద్ వేదికగా ఏర్పాటైన ‘ఇండియా సౌత్ సెంట్రల్’ రీజియన్ నాలుగోది కావడం విశేషం.
హైదరాబాద్‌లోని ఈ ఫెసిలిటీ సాంప్రదాయ నీటి ఆధారిత కూలింగ్ వ్యవస్థలకు భిన్నంగా ‘ఎయిర్-కూల్డ్ చిల్లర్స్’ ఉపయోగించడం ద్వారా సున్నా నీటి వినియోగం (Zero Water Usage) సాధిస్తుందని మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్ చందోక్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 2 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం ఉండగా, 2035 నాటికి అది 6-7 గిగావాట్లకు చేరుకుంటుందని, భారత్ కేవలం తన కోసమే కాకుండా ఆసియా మరియు గ్లోబల్ సౌత్ దేశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన క్లౌడ్ రీజియన్ ద్వారా భారత్‌లోని సంస్థలకు అత్యధిక డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం, సెక్యూరిటీ మరియు వేగవంతమైన డిజిటల్ సేవలు లభిస్తాయని మైక్రోసాఫ్ట్ వైస్ ఛైర్మన్ బ్రాడ్ స్మిత్ వీడియో సందేశంలో తెలిపారు.
ప్రముఖ పరిశోధనా సంస్థ IDC డేటా ప్రకారం, భారతదేశంలో పబ్లిక్ క్లౌడ్ సేవల వ్యయం 2030 నాటికి 22.2 శాతం వార్షిక వృద్ధి రేటుతో 45.7 బిలియన్ డాలర్లకు (రూ. 3.8 లక్షల కోట్లు) చేరుకోనుంది. అలాగే AI రంగంలో వ్యయం దీనికి రెట్టింపు వేగంతో పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన ఈ డేటా సెంటర్ తెలంగాణ ఐటీ రంగానికి మరియు దేశీయ డిజిటల్ రంగానికి సరికొత్త మైలురాయిగా నిలవనుంది.

