సిద్దిపేట/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో రెవెన్యూ అధికారులు గత మూడు రోజులుగా నిర్వహించిన సర్వే ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్ కాంపౌండ్ పరిధిలో అసైన్డ్ భూములు ఉన్నాయని, ఆ ఫామ్‌హౌస్ నీటి అవసరాల కోసమే ప్రధానంగా ఒక జలాశయాన్ని నిర్మించారని, అంతేకాకుండా ఆ ప్రాంతంలో దళితేతరులు పెద్ద ఎత్తున అసైన్డ్ భూములను ఆక్రమణలో ఉంచుకున్నారని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో ఎర్రవల్లి భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దళితేతరుల స్వాధీనంలో ఉన్న అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని నిజమైన దళిత లబ్ధిదారులకు పంపిణీ చేయాలని భావిస్తోంది. అలాగే, ఫామ్‌హౌస్‌కు నీటిని అందించే పాండురంగ జలాశయం నిల్వ సామర్థ్యాన్ని, వినియోగాన్ని పునఃపరిశీలించి, అదనపు భూమిని దళిత కుటుంబాలకు కేటాయించే దిశగా అడుగులు వేస్తోంది.
ధరణి రికార్డుల్లో వ్యత్యాసాలు – తహశీల్దార్‌కు ఫిర్యాదులు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ పోర్టల్ తీసుకువచ్చిన సమయంలో రికార్డులను మార్చారని రెవెన్యూ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రవల్లి, సివారు వెంకటాపురం గ్రామాల మధ్య సర్వే నంబర్ల గందరగోళాన్ని సరిదిద్దిన తర్వాతే పూర్తి వివరాలు తేలుతాయని, ఇప్పటివరకు ప్రాథమికంగా ఫామ్‌హౌస్‌లో కనీసం 10 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.
మరోవైపు, సివారు వెంకటాపురం గ్రామస్తులు మర్కూక్ తహశీల్దార్‌ను కలసి పాత భూ రికార్డులను అందజేశారు. పాండురంగ రిజర్వాయర్ నిర్మాణం కోసం తమ భూములను తీసుకుని, ప్రత్యామ్నాయ భూమి ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. వివాదాస్పద సర్వే నంబర్ 325లో ఉన్న అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని దళిత కుటుంబాలకు పునఃపంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

