Breaking News

సూర్యాపేట వద్ద ప్రమాదం: కార్లోనే సజీవ దహనమైన ప్రముఖ న్యూరో సర్జన్!

హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు రోడ్డు డివైడర్ ఇనుప గ్రిల్స్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఖమ్మం మమత ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ కె. జగదీష్ (50) కారులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే డ్రైవర్ సీటులో మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయింది. సమీపంలోని టోల్ గేట్ వివరాలు, కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మృతుడిని డాక్టర్ జగదీష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీప సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సుదీర్ఘ శస్త్రచికిత్సల అనంతరం ప్రయాణిస్తుండటంతో నిద్రమత్తు వల్లే డాక్టర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *