Breaking News

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. పోలీస్ శాఖకు తీరని లోటు

హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు అంత్యక్రియల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల

నిర్మల్ జిల్లా, అక్టోబర్ 21 (E6tv న్యూస్).

నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గడపలే బాబు (HC 2228) బైంసా పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆయన అకాల మరణం పట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు స్వగ్రామమైన నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెంబేరా గ్రామంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ హాజరై, ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను ఎస్పీ పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో పోలీస్ శాఖ కుటుంబానికి అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు మృతి పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ ఎస్. సాయికిరణ్, ఐపీఎస్, ముధోల్ సీఐ రవీందర్ నాయక్, తానూర్ ఎస్‌ఐ షేక్ జుబేర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దండేకర్ సాయికుమార్, పోలీస్ సిబ్బంది, బంధుమిత్రులు తదితరులు పాల్గొని గడపలే బాబుకు నివాళులర్పించారు.

నిర్మల్ పోలీస్… మీ పోలీస్…

E6tv NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *