రుద్రూరులో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
రుద్రూర్, అక్టోబర్ 22 (E6tv NEWS).
పెత్తందారులు, భూస్వాములు, జమీందారీ వ్యవస్థతో పాటు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు బైండ్ల బాలరాజు, మోద్దుల నరసయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అణచివేతను ఎదిరించి పోరాడిన గొప్ప ప్రజా యోధుడు పండుగ సాయన్న అని కొనియాడారు. తెలంగాణ ప్రజా వీరుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన ఆయన జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు.సమాజంలోని పేద ప్రజల కష్టాలను గుర్తించి, వారి సంక్షేమం కోసం పండుగ సాయన్న విశేషంగా కృషి చేశారని తెలిపారు. ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం, సేవాభావం, పేదల పట్ల మానవత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
