ముదిరాజుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించాలి – జిల్లా నాయకుడు బైండ్ల బాలరాజు
రుద్రూర్, అక్టోబర్ 23 (E6tv NEWS).
ముదిరాజులను ప్రస్తుత బీసీ-డీ జాబితా నుంచి బీసీ-ఏ జాబితాలోకి మార్చాలని ముదిరాజు సంఘం జిల్లా నాయకుడు బైండ్ల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మరింత ప్రయోజనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తే ఆ వర్గమంతా ప్రభుత్వానికి అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో నిర్వహించిన ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలకు బైండ్ల బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బైండ్ల బాలరాజు, ముదిరాజు సంఘ నాయకుడు మోద్దుల నరసయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజావీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజావీరుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు.సమాజంలోని పేద ప్రజల కష్టాలను గుర్తించి, వారి సంక్షేమం కోసం పండుగ సాయన్న చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇలాంటి మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ సమాజంలో సమానత్వం, సేవాభావం, పేదల పట్ల మానవత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజుల రిజర్వేషన్ సమస్యను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘ నాయకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
