Breaking News

ఏపీ నామినేషన్లలో హింస… 13 జిల్లాల్లో 31 ఘటనలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 31 చోట్ల ఎన్నికల సంబంధిత అల్లర్లు నమోదయ్యాయి. అభ్యర్థులపై దాడులు, పరస్పర ఘర్షణలు, నామినేషన్ పత్రాలను చించివేసి లాక్కోవడం వంటి ఘటనలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయ వర్గాల ప్రకారం 22 చోట్ల భౌతిక దాడులు జరగగా, 9 చోట్ల నామినేషన్ పత్రాలను ధ్వంసం చేసి మొత్తం 16 నామినేషన్ సెట్లను నాశనం చేశారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 8 ఘటనలు చోటుచేసుకోగా; అన్నమయ్య, కడప, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో మూడేసి చొప్పున అల్లర్లు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎంలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బాధితులుగా మిగిలారు.

ఈ హింసాకాండలో దుండగులు వాహనాలను దగ్ధం చేయడంతో పాటు, ఒక అభ్యర్థి ఇంటిని ఎర్త్‌మూవర్‌తో కూల్చివేశారు. రాళ్లు, కర్రలతో జరిపిన దాడుల్లో అభ్యర్థులతో పాటు ఒక పోలీసు కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పరిణామాలపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాలను ధ్వంసం చేయడం పౌరుల ప్రాథమిక ఎన్నికల హక్కుపై జరిగిన దాడి అని, ప్రజాస్వామ్య ప్రక్రియలో అరాచకానికి తావులేదని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డీజీపీ, ఇప్పటికే 16 కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *