విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కిరణ్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయం: కంజర్ల కృష్ణమూర్తి చారి
పటాన్చెరు, అక్టోబర్ 23 (E6tv న్యూస్).
విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో దసరా పురస్కారాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విశ్వబ్రాహ్మణులకు ఈ సందర్భంగా పురస్కారాలను అందజేసి సత్కరించారు.
ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏసీపీ కిరణ్ కుమార్, గౌరవాధ్యక్షులు ఇడికోజు వెంకటాచారి, అధ్యక్షులు డాక్టర్ తుంపాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బంగారు తాతారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ వేడుకకు తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరుకాగా, బ్రహ్మశ్రీ ఎడుకోజు వెంకటాచారి సభాధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా బ్రహ్మశ్రీ విశ్వనాథచారి, బ్రహ్మశ్రీ మురుగన్ సెల్వం, ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ వీరధర్మచ వెంకటాద్రి స్వామి, పరమపూజ్య డాక్టర్ కృష్ణ చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతి కోసం విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేఎం కిరణ్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి పురస్కారాలతో సత్కరించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
విశ్వబ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, సమాజ అభ్యున్నతికి కిరణ్ కుమార్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఘనంగా దసరా పురస్కారాల మహోత్సవాన్ని నిర్వహించిన ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

