Breaking News

ఉప్పల్‌లో కొత్త బస్ టెర్మినల్.. శంకుస్థాపన చేసిన పొన్నం!

ఉప్పల్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త బస్ టెర్మినల్ నిర్మాణానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం శంకుస్థాపన చేశారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో ఈ టెర్మినల్‌ను నిర్మిస్తుండగా, కేవలం 100 రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే రోజూ దాదాపు 1,053 బస్సు ట్రిప్పుల ద్వారా లక్ష మంది ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు అందనున్నాయి. ప్రత్యేక బస్ పాస్ కౌంటర్, ఇన్ఫర్మేషన్ సెంటర్‌తో పాటు ప్రయాణికులకు అన్ని ఆధునిక వసతులు కల్పించనున్నారు. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్‌కేసర్ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, ఐటీ కారిడార్‌ వైపు వెళ్లే వారికి దీనివల్ల మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 367 కోట్ల ప్రయాణాలు జరగగా, మహిళలకు రూ.12,888 కోట్ల ఆదా అయిందని గుర్తుచేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, పదవీ విరమణ పొందిన మాజీ ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *