సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వ విధానాలను విమర్శించే పోస్టులు, ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపడుతోందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టం పరిధిని ఉపయోగించి రోజూ వేల సంఖ్యలో విమర్శనాత్మక పోస్టులు, వీడియోలను తొలగిస్తోందని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆరోపించారు. ఖాతాలు లేదా వీడియోలను తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్న ప్రశ్నలను అణచివేయలేరని, ఈ రకమైన సెన్సార్‌షిప్ వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో మరింత అపనమ్మకం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ పలువురు ప్రముఖులు, సంస్థలు కూడా ఇన్‌స్టాగ్రామ్ చర్యలపై మండిపడ్డాయి. ‘వికసిత్ భారత్ 2047’ హామీపై తాను రాసిన వ్యంగ్య కవిత వీడియోను ఐటీ చట్టం కింద నోటీసులు ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్ నుండి డిలీట్ చేశారని ప్రముఖ కమెడియన్, గీత రచయిత వరుణ్ గ్రోవర్ వెల్లడించారు. అలాగే సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్‌కు సంబంధించిన తమ రీల్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ తొలగించిందని ప్రముఖ న్యాయ వార్తల సంస్థ ‘లైవ్‌లా’ పేర్కొంది. గతంలో నీట్ పేపర్ లీక్ అంశంపై నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు కారణమైన సీజేపీ, ప్రస్తుతం విమర్శకుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
