ఢిల్లీలో జరుగుతున్న ప్రత్యేక తీవ్ర స్థాయి ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువు ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత ఇప్పటివరకు కొత్తగా ఓటర్ల జాబితాలో చేరేందుకు కేవలం 2.71 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 27 వరకు మొత్తం 2,71,639 ఫారమ్-6 దరఖాస్తులు అందాయి. అంతకుముందు జరిగిన సవరణలో ముసాయిదా జాబితా నుంచి ఏకంగా 47,56,722 మంది ఓటర్లను తొలగించిన విషయం తెలిసిందే.
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈ ప్రక్రియలో అత్యధికంగా వెస్ట్ ఢిల్లీలో 33,377 ఫారమ్-6 దరఖాస్తులు రాగా, ఆ తర్వాత నార్త్ వెస్ట్ ఢిల్లీలో 27,341, ఈస్ట్ ఢిల్లీలో 26,212 దరఖాస్తులు దాఖలయ్యాయి. అక్టోబర్ 30తో క్లెయిమ్స్, అభ్యంతరాల గడువు ముగియనుంది. ఇదే సమయంలో తొలగింపు కోసం 20,654 ఫారమ్-7 దరఖాస్తులు, మార్పులు చేర్పుల కోసం 1,02,149 ఫారమ్-8 దరఖాస్తులు అందాయి. జూన్ 30కి ముందు 1.45 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, ముసాయిదా జాబితా నాటికి 97,53,577కి పడిపోయింది. నవంబర్ 30 నాటికి పెండింగ్ నోటీసుల ప్రక్రియ పూర్తి కానుండగా, డిసెంబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
