రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన.. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని అధికారుల సూచన
నిజామాబాద్, అక్టోబర్ 30: (E6 TV న్యూస్).
రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ రీజియన్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రీజియన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైవర్లు విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రయాణికుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, వాహనాలను జాగ్రత్తగా నడపాలని పేర్కొన్నారు.ముఖ్య అతిథులుగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ సురేష్ కుమార్ డ్రైవర్లకు పలు విలువైన సూచనలు చేశారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రహదారిపై ప్రతి క్షణం అప్రమత్తత అవసరమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీసే ప్రమాదం ఉందని వివరించారు.
ప్రతి ప్రయాణికుడి ప్రాణం ఎంతో విలువైనదని, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత అని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్-2 డిపో మేనేజర్‌తో పాటు ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.
