Breaking News

నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్

ఎన్నికలకు సర్వం సిద్ధం.. 45 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలి.. అల్లర్లు సృష్టించే వారిపై పోలీసుల నిఘా అవసరం

చెన్నేకొత్తపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా (E6tv న్యూస్).

చెన్నేకొత్తపల్లి మండలంలో నేడు జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మండల పరిధిలోని ఒక జడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఒక జడ్పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించనున్నారు.

మండలంలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 45 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలవ్యాప్తంగా 37,358 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 18,845 మంది పురుషులు, 18,512 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

ప్రశాంత ఎన్నికలే ప్రజల ఆకాంక్ష..

ఎన్నికలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా జరగాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా వినియోగించుకునే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.రాజకీయ ఆధిపత్యం కోసం గొడవలకు దిగడం, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు ప్రజాస్వామ్యంలో తావులేదని ప్రజలు పేర్కొంటున్నారు.

అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలి..

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఓటర్ల స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే ప్రతి ఒక్కరిపై ఎన్నికల అధికారులు, పోలీసులు సమానంగా వ్యవహరించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి..

ప్రజాస్వామ్య భవిష్యత్తు ఓటర్ల చేతుల్లోనే ఉందని, కుల, మత, ప్రాంతీయ రాజకీయాలకు, డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సమర్థులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని మేధావులు, విద్యావంతులు సూచిస్తున్నారు. ఎవరి ఒత్తిడికీ తలొగ్గకుండా, తమ ఓటును అమ్ముకోకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు.ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడం అధికారుల బాధ్యత అయితే, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాకుండా సమాజ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత కూడా అని పేర్కొంటున్నారు.

నేటి పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని చెన్నేకొత్తపల్లి మండలంలోని మేధావులు, సామాజిక సంస్కర్తలు, విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *